అమరావతిని అజరామరం చేశారు : నారా లోకేష్

చిరస్థాయిగా గుర్తుండిపోతుందన్న రాష్ట్రపతి

hellotelugu-NaraLokesh

ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రికొత్త చ‌రిత్ర‌కు దేశ ప్ర‌థ‌మ పౌరురాలు సాక్షి సంత‌కం కావ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఘ‌ట్ట‌మ‌ని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప్ర‌శంసించారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన బిల్లుకు దేశ‌మంతా ఒక్క‌టై మ‌ద్ద‌తు ఇవ్వగా, రాజ‌ముద్ర వేసి అమ‌రావ‌తికి శాశ్వ‌త‌త్వం క‌ల్పిస్తూ శాస‌నం చేసిన‌ రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారని అన్నారు. మా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-మా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఆంధ్ర‌జాతి స‌గ‌ర్వంగా త‌ల ఎత్తి చాటేలా చారిత్ర‌క అమ‌రావ‌తి రాజ‌ధాని చ‌ట్టంపై సంత‌కం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్ర‌ప్ర‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

విభ‌జ‌న‌తో కోలుకోని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట పోయింద‌ని, రాజ‌ధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని గుర్తించి.. ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్ణ‌యిస్తూ చ‌ట్టం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ముకి ఆంధ్ర‌జాతి త‌ర‌ఫున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేశామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి-రాజ‌ధానిలో పూర్త‌యిన నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం మొత్తం నిర్మాణాలు పూర్త‌యితే అమ‌రావ‌తి రాజ‌ధాని ఎలా ఉంటుందో సూచించే ఊహా చిత్రాలు, ప‌ర్యావ‌ర‌ణ‌హిత నిర్మాణ విశేషాల‌తో రూపొందించిన పుస్త‌కాన్ని ఎంపీల‌తో క‌లిసి లోకేష్ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి అంద‌జేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతి కి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ అని, 2024 లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పనులు పునః ప్రారంభించింది ప్రధాని అని రాష్ట్రపతికి వివరించారు.

Exit mobile version