చిత్తూరు జిల్లా : రాయలసీమను రతనాల సీమగా మార్చేంత వరకు తాను నిద్ర పోనని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ప్రారంభించినట్లే కుప్పంలోనూ బంగారు గనులు ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్‌లో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రానికి అది శ్రీరామరక్షగా మారిందన్నారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకొచ్చి 110 చెరువులు నింపామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన పంటలను ప్రోత్సహించి రాయలసీమను అభివృద్ధి చేస్తామని, వచ్చే నెలలో మదనపల్లెలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
కుప్పంలో రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా డెయిరీ రంగాన్ని విస్తరిస్తామని, వాణిజ్య పంటలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, బీసీలు, ఓసీల ఇళ్లపైనా రూ.552 కోట్లతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఇంటి మిద్దెలపైనే కూరగాయలు పండించే విధానాన్ని ప్రోత్సహించాలని, ఈ-సైకిళ్ల వినియోగం పెంచి కాలుష్యరహిత కుప్పాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ ఆధారిత జీవన విధానం వైపు వెళ్లాలని సూచించారు. కుప్పంలోని బ్లూ గ్రానైట్‌కు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. అందుకే హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
