టాలీవుడ్‌లో చిన్న సినిమాల అణ‌చివేత

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన చిత్ర నిర్మాత

hellotelugu-SheraazMehdi

హైద‌రాబాద్ : న‌టుడు, చిత్ర నిర్మాత షిరాజ్ మెహ‌దీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిన్న సినిమాలను అణచి వేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టాలీవుడ్ నిర్మాతలపై అసహనం వ్యక్తం చేశారు. తక్కువ బడ్జెట్ సినిమాలకు థియేటర్ల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాల‌ని కోరారు. చిన్న సినిమాలకు తగిన వేదిక కల్పించడంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తాను నిర్మించి, నటించిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా ప్రచారానికి ఎంతో కృషి చేసినప్పటికీ, దానికి తగిన ఆదరణ లేదా వేదిక లభించలేదని ఆయన వాపోయారు.

చిన్న సినిమాల కంటే భారీ బడ్జెట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చిత్ర నిర్మాత షిరాజ్ మెహ‌దీ విమర్శించారు. చిన్న నిర్మాతలకు థియేటర్ల కేటాయింపులో సమస్యలు ఉన్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క్యూబ్ , యుఎఫ్‌ఓ ప్రొజెక్షన్ ఖర్చులను భరించేలా చిన్న బడ్జెట్ నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిల్మ్ ఛాంబర్‌ను విమర్శించిన ఆయన‌ మల్టీప్లెక్స్‌ల ద్వారా థియేటర్లకు కల్పించిన భద్రతను ఉపసంహరించు కోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేస్తున్నారని చిత్ర నిర్మాత‌ ఆరోపించారు. బెదిరింపులు ఎదురైనప్పటికీ చిన్న చిత్రాల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని షిరాజ్ మెహదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు. అలాగే, తన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రాన్ని తిరిగి విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

Exit mobile version