బెంగళూరు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మార్పు కోసం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన జీవితాలు శాశ్వతం కాదు, మనం వదిలి వెళ్ళేది శాశ్వతం అని అన్నారు. మన మాటను కొలవాలి. మనం చేసిన పనికి అత్యంత ప్రాముఖ్యత ఉండాలని అన్నారు. దేవుడు శాపం లేదా ఆశీర్వాదాలు ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడని నేను చెబుతూనే ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు డీకే శివకుమార్. ఆ అవకాశాలతో మనం ఏమి చేస్తామో అది ముఖ్యం అన్నారు. ఇదిలా ఉండగా ఈడీ తాజాగా తనకు నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్రంగా స్పందించారు డీకే శివకుమార్.
ఇప్పటికే తన ఆర్థిక వనరులు, లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను విచారణ సందర్బంగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. తనతో పాటు తన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ ను కూడా విచారించారని తెలిపారు డీకే శివకుమార్. కానీ కావాలని పదే పదే నోటీసులు ఇవ్వడం ఇది రాజకీయ పరమైన కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , ఆ విషయం భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
















