ఘ‌నంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘ‌నంగా ఏర్పాట్లు చేశామ‌ని తెలిపిన ఈవో ఎం. ర‌విచంద్ర‌

hellotelugu-SriKaalyanaVennkateswaraSwamy

తిరుప‌తి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకు ముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామి వారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామి వారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కొత్త‌గా కొలువు తీరిన ఈవో ర‌విచంద్ర మీడియాతో మాట్లాడారు. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆల‌యంలో 16వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 12న గరుడసేవ, ఫిబ్ర‌వ‌రి 13న స్వర్ణ రథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 15న రథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 16న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో వి. వీరబ్రహ్మం సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఆలయ ప్ర‌త్యేకాధికారి , సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version