హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితం అన్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగ బద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్పా మరోటి కాదన్నారు.
ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బ తీయడమేనని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురు దెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమై పోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికి పోతోందని తేలి పోయిందన్నారు.
పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదన్నారు తన్నీరు హరీశ్ రావు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
