అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉందని ప్రచారం జరుగుతున్న వార్తలు అసత్యమని మంత్రి స్పష్టం చేశారు. కంటైనర్ల కొరత కారణంగా ఎగుమతులు ప్రభావితం అవుతున్న పరిస్థితి ప్రస్తుతం లేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంటైనర్లు ఇప్పటి వరకు వెనక్కి రాలేదని అన్నారు. ఎగుమతుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, రైతులకు సమయానుకూల సూచనలు అందించేందుకు ప్రతి నెల చివరి వారంలో APSADA డైరెక్టర్లు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారతదేశం , యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కొనసాగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) చర్చలు పూర్తైతే భారత సముద్ర ఆహార ఎగుమతులకు మరింత మార్కెట్ అవకాశాలు లభించి భవిష్యత్తులో ఎగుమతులు పెరగడానికి దోహద పడతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అమెరికా మార్కెట్‌లో డిమాండ్ 2026 మార్చి నెలాఖరుకు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా 50 మరియు 60 కౌంట్ రొయ్యలకు మంచి డిమాండ్ ఉంటుందని, ఇవి ఆంధ్రప్రదేశ్ రైతులు సాధారణంగా ఉత్పత్తి చేసే సైజులు కావున ఆ కౌంట్ వచ్చే వరకు మధ్యస్థ పెట్టుబడులు చేయనవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు. భారతీయ రొయ్యలపై అమెరికా విధించే సుమారు 20 శాతం టారిఫ్ (Basic Duty, Anti-Dumping Duty – ADD, Countervailing Duty – CVD సహా) ఇతర పోటీ దేశాలపై ఉన్న టారిఫ్‌లతో సమానంగా ఉండటం వల్ల అంతర్జాతీయ సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్‌లో భారతదేశ పోటీ సామర్థ్యం కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
















