అమరావతి : రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసింగ్ కోసం వివిధ స్థాయిల్లోని పోలీసులకు సర్టిఫికేషన్ కోర్సులను అందించాలని, వారి సేవలను వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం పూర్తిగా మారి పోయిందన్నారు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను కూడా ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం, రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులతో కలిసి భవిష్యత్ పోలీసింగ్‌కు అవసరమైన సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లిటరసీ ఆధారంగా భవిష్యత్ పోలీసింగ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. 2
001లోనే ఇదే తరహాలో ఫ్యూచర్ పోలీసింగ్ వర్క్‌షాప్ నిర్వహించామని గుర్తు చేసిన సీఎం, అప్పటితో పోలిస్తే నేడు నేరాల తీరు, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పోలీసు వ్యవస్థకు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. నేరాలను అరికట్టడమే కాదు నేరం చేసిన వారికి వేగంగా శిక్షలు పడేలా దర్యాప్తు వ్యవస్థ పనిచేస్తేనే నేరస్థుల్లో భయం ఏర్పడుతుందని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు ప్రణాళికలు, సమర్థవంతమైన దర్యాప్తు, వేగవంతమైన ఫలితాలే పోలీసింగ్‌కు అసలైన ప్రమాణాలన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను రీ-స్ట్రక్చర్ చేయాలని, ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
















