అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతి జిల్లా పోలీసులు చేపట్టిన కార్యక్రమాలకు ఫిదా అయ్యారు. ఈమేరకు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు హర్షణీయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం “నో హెల్మెట్ – నో పెట్రోల్” నిబంధనను తీసుకు రావడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 700 మంది ద్విచక్ర వాహనాలపై పోలీసు సిబ్బందితో కలిసి హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించడాన్ని సీఎం అభినందించారు.
ఇదిలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కాన్సెప్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు . దీని వల్ల వాహనదారుల్లో భయంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు, ఎస్పీ మనోహర చారితో పాటు జిల్లాలోని పోలీసులను అభినందించారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా పాల్గొనడం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తెచ్చే నిబంధనలు, సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.
















