తిరుపతి : ఎస్వీబీసీ ఛానల్ పనితీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ . హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు అందేలా చూడాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని ఛానల్ సీఈవోను ఆదేశించారు.
టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్‌డీ ఛానల్ అప్‌లింకింగ్ , డౌన్‌లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు. హెచ్ డీ ఛానల్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు అనిల్ కుమార్ సింఘాల్.
అదేవిధంగా, ఎస్వీబీసీ ఛానల్ లో ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్ లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్ లో సాధారణ వైద్య చికిత్సలు, అరవింద్ ఐ హాస్పెటల్ లో కంటి వైద్య చికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.



















