ఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సాక్షిగా. భారత రాజ్యాంగం అజరామరమని, దానిని ఎవరు మార్చాలని ప్రయత్నం చేసినా భంగపాటు తప్పదన్నారు. వారసత్వాన్ని, సంస్కృతిని, భాషను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఇలయ నాయగన్. పెరియార్, సి.ఎన్. అన్నాదురై, మహాత్మా గాంధీ వంటి సంఘ సంస్కర్తలు ఈ దేశంలో కొలువు తీరారని అన్నారు. వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాయకుల ప్రభావం తన ఆలోచనలు, భాష , రాజకీయాలపై ఎలా ఉందో కమల్ హాసన్ ప్రస్తావించారు. భాష, సంస్కృతి , హక్కులను పరిరక్షించడంపై అన్నాదురై బోధనలను ఆయన హైలైట్ చేశారు.
సి.ఎన్. అన్నాదురై నన్ను తమిళానికి పరిచయం చేశారు, ఆయన మన భాష, మన సంస్కృతి, మన హక్కులపై జరిగే ఏ దాడినైనా ఎదుర్కోవాలని మాకు నేర్పించారు అని సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలయ నాయగన్. అధికారం కంటే ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రజాస్వామ్య రథం విభేదాలపై దూసుకు పోతోందని ఆవేదన చెందారు. కానీ ఎప్పుడూ ప్రజలపై దూసుకు పోకూడదని, దానిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. అధికారం తాత్కాలికమని ఆయన ఎంపీలకు గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అమరత్వం కలిగి ఉండదు. చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతత్వాన్ని సాధించ లేదన్నారు.
