హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన దివంగత బాల సాయిబాబాకు చెందిన భూములపై ఇంకా పంచాయతీ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు దాకా చేరింది. ఇందుకు సంబంధించి ఈ భూములు తమవేనంటూ ఇటు తెలంగాణ అటు ఆంధ్రా సర్కార్లు పట్టు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బాల సాయిబాబా భూములపై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా తెలంగాణ సర్కార్ పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ 42.03 ఎకరాల బాల సాయిబాబా భూములు తమవే అంటూ ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లో సర్వే నంబర్ 105 నుంచి 108లో బాలసాయి బాబా ట్రస్ట్ పేరుపై 1990లో రిజిస్టర్ అయి ఉన్నాయి 42.03 ఎకరాల భూములు.
ఈ భూములను ట్రస్ట్ పేరున క్రమబద్ధీకరిస్తూ 2005లో జీవో తెచ్చింది అప్పటి ప్రభుత్వం.ట్రస్ట్ భూముల్లో అభివృద్ధి ఒప్పందానికి అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ 2013లో హైకోర్టును ఆశ్రయించింది మేనేజింగ్ ట్రస్ట్. ఈ నేపథ్యంలో బహిరంగ వేలానికి విధి విధానాలు రూపొందించింది. .రాష్ట్ర విభజన తర్వాత భూములను ప్రైవేట్ సంస్థ, భూపతి అసోసియేట్స్‌కు అప్పగించడం వివాదానికి దారి తీసింది. దీనిని సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. అలానే మరో 24 రిట్ పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు కావడంతో విచారణ చేపట్టింది కోర్టు. దీనిపై విచారణ జరిపి ఈ నెల 9 వరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటి దాకా కౌంటర్ ను దాఖలు చేయలేదు.
















