తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ ఈవో ఎం రవిచంద్ర పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాలమార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక బంగారు గజ లక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు రూ. 62.44 లక్షలు విలువ చేసే ఆభరణాలు బహుకరించారు. తిరుమల నుండి పెష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
