హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహర్‌నగర్ డంప్ యార్డును తొలగించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. జవహర్‌నగర్ ‘జన సంకల్ప యాత్ర’లో భాగంగా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో పాదయాత్ర చేపట్టిన ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి తమకు మద్దతుగా వచ్చారని తెలిపారు. 25 ఏళ్ల క్రితమే తాము జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశామని తెలిపారు. జవహర్‌నగర్ డంప్ యార్డును తొలగించాలని జస్టిస్ స్వతంతర్ కుమార్ అప్పట్లో ఆదేశించారని , ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు. ఈటల రాజేందర్ మన కోసం పాదయాత్ర చేస్తున్నారని, ఆయనకు మద్దతు తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్బంగా పురుషోత్తం రెడ్డి విన్నవించారు.
మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, అది మన హక్కు. కానీ ఇక్కడ గాలి విష పూరితంగా మారింది. గాలి అనేది ప్రాణవాయువు కోసం, ప్రాణాలు తీయడానికి కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. చెత్త నుండి వచ్చే వ్యర్థ ద్రవాల (లీచాటే) వల్ల తాగునీరు కలుషితమైందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం మన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఏలుతున్న సర్కార్ పై ఉంటుందన్నారు ఎంపీ ఈటల రాజేందర్. కోర్టు తీర్పులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఈ సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కోర్టులు తీర్పులు ఇచ్చాయి, నిపుణులు పరిష్కారాలను సూచిస్తున్నారు.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
