అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట కాకినాడ జిల్లా పరిధిలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని చెప్పారు. కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ , ఎస్పీ బిందు మాధవ్ తో సమావేశం అయ్యారు. కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలలని అన్నారు. రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిన చోట కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. చిన్న చిన్న గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.
