అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీ పంచాయతీరాజ్ శాఖ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గానికి రూ. 53 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను రహదారుల నిర్మాణానికి కేటాయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లె పండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు.
పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.
