తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీ గోవింద రాజస్వామి వారు చిన్నశేష వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. ముందుగా గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, గోవింద నామ సంకీర్తనలతో మాడ వీధులను భక్తి రసమయం చేశాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి చిన్నశేష వాహనం దివ్యశోభను సంతరించుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి గోవిందుడిని దర్శించుకొని పరవశించారు.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు “శేషి”, జగత్తు “శేషభూతం”గా భావించ బడుతుంది. ఈ శేషశేషి తత్వానికి ప్రతీకగా చిన్నశేష వాహనం నిలుస్తుంది. చిన్నశేష వాహన సేవను దర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. అనంతరం ఉదయం 10 గంటల నుండి కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ జరగనుండగా, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
