తిరుమల : టీటీడీ శ్రీవారి భక్తులకు ఖుష్ కబర్ చెప్పింది. ఈ ఏడాది 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటాకు సంబంధించి విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీ పాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక వర్చువల్ కోటాకు సంబంధించి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని పేర్కొంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు , తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలకు సంబంధించి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ లో రిలీజ్ చేస్తామని పేర్కొంది టీటీడీ. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవా కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
