న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 5వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా “మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం” బచావో ఉద్యమం ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది.
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించింది. పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది.
మహాత్ముడి పేరుతో తీసుకు వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడు కోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. దీని కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ఏఐసీసీ బాస్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అత్యున్నత సంస్థలన్నీ ఇప్పుడు మోదీ, అమిత్ షా కు జేబు సంస్థలుగా మారి పోయాయని అన్నారు.

















