హైదరాబాద్ : పట్టణాలు, పల్లెల సమగ్ర అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నానని ప్రకటించారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి రూ. 5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపల్ పాలకవర్గ సభ్యులు , కీలక నాయకులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధి, వార్డుల వారీగా ప్రజల సమస్యలు, కనీస వసతుల కల్పన, సాగునీటి పరిస్థితులు , ఇతర అంశాలపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు అందుబాటులో లేనప్పటికీ, ప్రతి వార్డులో అత్యవసర అభివృద్ధి పనులను చేపట్టడానికి రూ. 5 లక్షల చొప్పున కేటాయిస్తామని ప్రకటించారు. మున్సిపల్ అంతర్గత నిధుల కేటాయింపులో పరిమితులు ఉన్నప్పటికీ, నిధుల కొరత అభివృద్ధి పనులకు ఆటంకం కాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పనిచేసే అవకాశం తనకు లభించిందని, ఆ బాధ్యతలకు తగినట్లుగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతలు ఎంత పెద్దవైనప్పటికీ, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని తానేనని స్పష్టం చేశారు.
వరుసగా ఏడుసార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ, తాను హైదరాబాద్‌లోని ప్రభుత్వ నివాసంలోనే ఉంటున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పారు. తన సమయాన్నంతా ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి , తనకు అప్పగించిన శాఖల సమర్థవంతమైన నిర్వహణ కోసమే వినియోగిస్తున్నానని తెలిపారు. ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా కేవలం ప్రజల కోసమే శ్రమిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పని చేయాలని కోరారు.


















