హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే జాగృతి జనం బాట పేరుతో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను వింటున్నారు. ప్రస్తుతం మరో కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆస్క్ కవిత పేరుతో సోమవారం ఎక్స్ వేదికగా చర్చకు ఆహ్వానించారు. మేధావులు, తెలంగాణవాదులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, సాధారణ పౌరులు, విద్యార్థులు , ఇతర రంగాలకు చెందిన తనను అడగవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సాయంత్రం ఎక్స్ లో #AskKavitha సెషన్‌ను నిర్వహించనున్నారు . గతంలో కూడా ప్రత్యక్ష, ఇంటరాక్టివ్ సెషన్ ను నిర్వహించారు. మరోసారి దీనిని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
ఇందుకు సంబంధించి #AskKavitha అనే ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ప్రశ్నలు అడగాలని, తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానించారు. ఆమె అధికారిక X హ్యాండిల్‌లో చేసిన ఈ ప్రకటన ఇప్పటికే ఆన్‌లైన్‌లో గణనీయమైన చర్చకు దారితీసింది .తన మద్దతుదారులు, విమర్శకులు, రాజకీయంగా తటస్థంగా ఉండే వినియోగదారులతో సహా అనేక మంది నుండి విస్తృత భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ బహిరంగ వేదిక విధానం విమర్శలతో ప్రత్యక్ష సంభాషణకు దారి తీస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత రాజకీయ భవిష్యత్తు, ఇటీవలి ఎన్నికల ఓటముల తర్వాత బీఆర్‌ఎస్ ప్రస్తుత పరిస్థితి, పార్టీ సీనియర్ నాయకత్వానికి సంబంధించిన వివాదాలపై పదునైన ప్రశ్నలు ఈ సంభాషణలో ఉంటాయని అంచనా.
















