న్యూఢిల్లీ : ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇంకా తుది తీర్పు వెలురించక పోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు. శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం సమయం మీకు ఇవ్వాలంటూ ప్రశ్నించింది. పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారంటూ పేర్కొంది కోర్టు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్పీకర్‌కు చివరి అవకాశంగా మరో మూడు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సందర్బంగా స్పీకర్ తరపున న్యాయవాది కోర్టులో వివరాలు వెల్లడించారు. స్పీకర్ కావాలని చేయడం లేదని తెలిపారు.
ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాది. మూడు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం ప్రకటించక పోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని సీరియస్ గా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న స్పీకర్ ఇలా వ్యవహరిస్తే ఎలా అని మండిపడింది. మరో వైపు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.
