హైదరాబాద్ : వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాక పోవడంతో చిత్ర బృందం దీనిని వాయిదా వేసింది. నిర్మాత నాగ వంశీ ఇంకా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ సంగీత దర్శకుడు తమన్ పొరపాటున ఆ తేదీని బయట పెట్టినట్లు కనిపిస్తోంది. సినిమా రీ-రికార్డింగ్ పనులకు సంబంధించిన అప్‌డేట్‌ను ఎక్స్ లో పంచుకున్నాడు. తను మూవీ మేకర్స్ ను పక్కన పెట్టాడు. అక్టోబర్ 30వ తేదీన ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని చెప్పేశాడు. దీంతో నెటిజన్లు విస్తు పోయారు. మరో వైపు పదే పదే వాయిదా వేయడంపై వెంకటేష్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఇదిలా ఉండగా తమన్ ఎరక్క పోయి ఇరుక్కున్నట్లు గుర్తించాడు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకుని
తమన్ ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి తేదీని తొలగించారు. అయితే, ‘ఎడిట్ హిస్టరీ’ ద్వారా అభిమానులు అసలు పోస్ట్‌ను గమనించారు, దీనితో ‘ఆదర్శ కుటుంబం’ 30న విడుదలయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త విడుదల తేదీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి శుక్రవారం నాడు ఈ సినిమా నిజంగానే థియేటర్లలోకి వస్తుందా లేదా అని నిర్ధారించే ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, నారా రోహిత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
