హైదరాబాద్ : హైదరాబాద్ లోని తార్నాకలో విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఆస్పత్రికి అరుదైన గుర్తింపు లభించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (NABH) నుండి గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్య సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా నిలువనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాల, వైద్య సేవల బలోపేతం, సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తూ వస్తోంది.
అధునాతన అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ కలిగి ఉంది. వివిధ రకాల చికిత్స సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయాలు రోగులకు సమయానుకూలంగా, సురక్షితంగా, ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయ పడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్ర చికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసినన్ లో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఇవి నైపుణ్యంతో కూడిన ఆరోగ్య సేవా సిబ్బందిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


















