అమరావతి : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన, నిబద్దత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎ. శరత్ కు అరుదైన పదవిని కట్టబెట్టింది. తనను ఏకంగా అత్యంత పేరు పొందిన, కోట్లాది మంది భక్తులను కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సంయుక్త కార్య నిర్వహణ అధికారి (జేఈవో)గా నియమించింది. ఇదిలా ఉండగా దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎ. శరత్ స్వస్థలం నల్లగొండ జిల్లా.
దామరచర్ల గిరిజన వర్గానికి చెందిన శరత్ కడు పేదరికం అనుభవించి పట్టుదలతో చదివి సర్కారు కొలువు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు. తాను పని చేసిన ప్రతి చోటా పేదలకు మేలు చేకూర్చేలా పనులు చేపట్టారు. తన పనితీరును చూసి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంవో ఓఎస్డీగా అవకాశం కల్పించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నల్లమల బిడ్డగా, గిరిజన ప్రాంతాల్లో సౌర వెలుగులు నింపాలన్న లక్ష్యంతో గిరిపుత్రుడు డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ (రి) కు సంప్రదాయేతర ఇంధన వనరులు సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా తనను టీటీడీలో విద్యా, ఆరోగ్య అంశాలకు సంబంధించి జేఏఈవో గా నియమించారు.

















