హైదరాబాద్ : చదువుల తల్లిగా పేరు పొందిన బాసర సరస్వతి ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. భారీ ఎత్తున ఆలయ అభివృద్దికి నిధులు కేటాయించింది సర్కార్. ఈ మేరకు రూ. 225 కోట్లు కేటాయించారు. బాసర ఆలయ పునః నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు.. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు.. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. భక్తుల సంఖ్య.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు.
ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంట శాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు… తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు..
