చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన సభలో తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని తప్పనిసరిగా ముందుగా పాడాలని కోరుతూ సీఎం ప్రత్యేకంగా తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించి అధికారంలో ఉన్న టీవీకే పార్టీతో పాటు డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఐ, సీపీఎం, ముస్లీం లీగ్ పార్టీ, వీసీకే, తదితర పార్టీలకు చెందిన సభ్యులంతా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని అన్నారు. అది ఒక ఆలోచనా విధానమని పేర్కొన్నారు. తరతరాల చరిత్రకు దర్పణం. మన సంస్కృతి-నాగరికత అని అన్నారు సీఎం.
తమిళం మన జీవితం, తమిళం మన భావోద్వేం అని కూడా గుర్తించాలన్నారు విజయ్. ఈ విషయాన్ని మన తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణంగా గ్రహించిందని చెప్పారు. ఇంకా, తమిళ భాష పట్ల తమిళ ప్రజల ప్రాచీనత, విశిష్టత, గర్వం, శ్రేష్ఠత , భావాలను నిలబెట్టి, పరిరక్షించే ఈ చారిత్రాత్మక తీర్మానం, తమిళ మాతకు సమర్పించిన అత్యున్నత నివాళిగా నిలుస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఈ తీర్మానం ఆమోదించబడిన ఈ రోజు, తమిళనాడు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందని చెప్పారు .ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపి, ఆమోదించిన అన్ని రాజకీయ పార్టీలకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని ఈ సందర్బంగా చెప్పారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.

















