తిరుమల : శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమల లోని సేవా సదన్ లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన సేవకులతో స్వయంగా మాట్లాడారు. శిక్షణా కార్యక్రమంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రూప్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. సేవకులు ఈవోకు అభినందనలు తెలిపారు. పలువురు సేవకులు తమ సలహాలు, సూచనలు అందించారు.
అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సేవకులతో సంభాషించారు. 2000 సంవత్సరం నవంబర్ నెలలో 200 మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం 17 లక్షల మందికి చేరుకోవడం చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తిరుమల పుణ్య క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు ప్రతి రోజూ తరలి వస్తుంటారని అన్నారు ఈవో. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి సేవకులు నిబద్దతతో ఉండాలని సూచించారు. మన ప్రవర్తన ఎదుటి వారిని ఆలోచించేలా, ఆకర్షించేలా తమను తాము ప్రూవ్ చేసుకునేలా చూడాలన్నారు అనిల్ కుమార్ సింఘాల్. రాబోయే రోజుల్లో సాంకేతికతను జోడిస్తామన్నారు.
