తిరుమల : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ను భారత దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి.ఆర్. నాయుడు వెల్లడించారు. చైర్మన్ సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని చెప్పారు. ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, . రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచి వుండేందుకు వీలగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు చెప్పారు.
ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా ఈ రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ చైర్మన్ బీఆర్ నాయుడుకు వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు చెప్పారు.
