తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ఆదివారం రథసప్తమిని ఘనంగా నిర్వహించారు టీటీడీ ఆధ్వర్యంలో. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయ బద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయణం చేయడంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాస గద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, సదాశివరావు, నరేష్ , శాంతా రామ్, జానకి దేవి, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి , జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.



















