న్యూఢిల్లీ : ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన బిసి ఉమెన్ పోరు దీక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న కుట్రను నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కలిపి దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు వి. శ్రీనివాస్ గౌడ్. ఉత్తర భారత దేశానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించేందుకు కుట్రకు తెర లేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశ ప్రమేయం లేకుండానే ఎన్నికల్లో గెలవచ్చు అన్న ఉద్దేశంతో దక్షిణది రాష్ట్రాలకు మోసం చేసే కుట్ర లో భాగమే ఇది అని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంట్లో 25% ప్రాతినిథ్యం ఉంది, 2011 ప్రకారమే నియోజకవర్గాలను పునర్విభజిస్తే 19 శాతం ప్రాతినిథ్యం తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 25% మాదిరిగానే డీలిమిటేషన్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు వి. శ్రీనివాస్ గౌడ్.
ఇలా చచేస్తే రాబోయే రోజులలో దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కారణం అవుతుంది. ఇప్పటికే అత్యధిక ఆదాయం ఇస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ విషయంలో, ప్రతిదీ అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కానీ మహిళా రిజర్వేషన్లలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమానత్వం ఉంటుందన్నారు.
