హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి గ్యాస్, పెట్రోల్ కొరత లేదన్నారు. కొందరు కావాలని సోషల్ మీడియా వేదికగా కొరత ఉందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నుంచి ఎవరైనా ఆధారాలు లేకుండా వార్తలు రాసినా లేదా ప్రసారం చేసినా, పోస్టు చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొన్నారు. భారీగా నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో అంతా కంట్రోల్ లోనే ఉందన్నారు.
రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈవీ వాహనాల ప్రోత్సాహం ఎంతగానో దోహద పడుతుందని నొక్కి చెప్పారు. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధార పడటాన్ని తగ్గించు కోవడానికి, ప్రజలను ఈవీ వాహనాలకు మారేలా ప్రోత్సహించడానికి తెలంగాణ సర్కార్ చురుకుగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ చొరవలో భాగంగా, తెలంగాణలో విద్యుత్ వాహనాల (EVs)పై రోడ్డు పన్ను , రిజిస్ట్రేషన్ రుసుముల నుండి రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మినహాయింపును మంజూరు చేసిందన్నారు.
విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి, ఒక పటిష్టమైన బ్యాటరీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విస్తృత కృషిని కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత 1.20 లక్షలకు పైగా ఆటో-రిక్షాలను ‘రెట్రో ఫిట్టింగ్’ ద్వారా విద్యుత్ వాహనాలుగా (EVs) మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే TGSRTC కోసం విద్యుత్ బస్సుల కొనుగోలు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
















