మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆహార పదార్థాలలో కల్తీ చేసి, అక్రమ లాభాల కోసం ప్రజారోగ్యానికి భంగం కలిగించే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. ఆహారమే మానవ జీవనాధారమని పేర్కొన్నారు. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, సరఫరాపై నిఘా నిరంతరాయంగా కొనసాగుతుందని, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా లాభపడాలని చూసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై ఎస్ఓటి మల్కాజిగిరి , ఆహార కల్తీ నిఘా బృందాలు కలిసి మెరుపుదాడి నిర్వహించాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా జరిపిన ఈ తనిఖీలలో పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వంటి వాటిని నిర్దేశిత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటించకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేసి ప్యాక్ చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు.
వంటగదిలో రుచికి, ఆరోగ్యానికి ఆధారంగా ఉపయోగించే మసాలాలు, కల్తీ వ్యాపారానికి సాధనాలుగా ఎలా మారాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. కారం పొడిలో 30% రాంప్ పౌడర్ (ఆవు పేడ దుమ్ము) ఉన్నట్లు కనుగొని అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాకుండా వినియోగదారులు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని నమ్మించి మోసం చేయడానికి, అసలైన బ్రాండ్‌లను పోలిన నకిలీ ప్యాకేజింగ్ , లేబుల్‌లను ఉపయోగిస్తున్నట్లు వారు ఆధారాలు కనుగొన్నారు.
ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ముసుగులో నాసిరకం ఆహార పదార్థాలను మార్కెట్లకు పంపుతున్నట్లు తనిఖీలలో వెల్లడైంది . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సుమతి. వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్‌కు పంపే చర్యను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆకర్షణీయంగా ఉన్న లేదా ప్రముఖ బ్రాండ్ పేరును పోలి ఉన్న ప్యాకెట్‌ను ప్రజలు సహజంగానే నమ్ముతారని, ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందే నేరస్తులు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అటువంటి అక్రమ వ్యాపారాలపై సమాచారాన్ని సేకరించి, వాటి మూలాలను గుర్తించి, చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ దాడిలో పోలీసులు భారీ మొత్తంలో మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారు 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి , 100 కిలోల గరం మసాలాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 10,890 కిలోలు (అంటే 10.89 టన్నులు) మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని తెలిపారు. బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ , బ్యాచ్ నంబర్, FSSAI వంటి ముఖ్యమైన వివరాలను సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సీపీ ప్రజలను కోరారు. ప్యాకేజింగ్ సరిగా లేకపోయినా, లేబులింగ్‌పై అనుమానం ఉన్నా లేదా నాణ్యతపై సందేహం ఉన్నా, అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆమె సూచించారు.

















