హైదరాబాద్ : మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో స్త్రీ రైడ్ –ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల భద్రత, సాధికారత, ఆర్థిక స్వాతంత్ర్యం పరస్పరం అనుసంధానమైన అంశాలని, మహిళలకు గౌరవ ప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో మరింత బలమైన స్థానాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం తొలి దశలో భాగంగా 50 మంది మహిళా బైక్ రైడర్లు, నలుగురు మహిళా ఆటో డ్రైవర్లు, ఒక మహిళా క్యాబ్ డ్రైవర్‌కు ప్రత్యేక శిక్షణ అందించారు. ప్రజా రవాణా, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల మహిళా ప్రయాణికుల్లో భద్రతాభావం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు మరింత సురక్షితమైన రవాణా సేవలు అందించడంలో మహిళా డ్రైవర్లు కీలక పాత్ర పోషించగలరని తెలిపారు.
మహిళా డ్రైవర్లకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని MAWO సీఈఓ జై భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జిప్పి సీఈఓ ప్రసన్న నారాయణ, మహీంద్రా ఆటో సంస్థ వాహనాలను అందించగా శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా జెండా తో స్త్రీ రైడ్ ని ప్రారంభించారు. ఆ తరువాత డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రొఫెషనల్ డ్రైవర్లుగా పనిచేయడానికి సిద్ధపడటం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళ సాధికారత, భద్రత, సామర్థ్య పెంపు ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు మహిళల విజయంలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకం. భర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాలు సాధించగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, డీజీ ఆర్గనైజేషన్స్ స్వాతి లక్రా, మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఐజీ రోడ్ సేఫ్టీ రమేష్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.















