Stock Market : అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, ఇన్ఫోసిస్ ప్రకటించిన భారీ బైబ్యాక్ ప్రోత్సాహంతో ఈక్విటీ మార్కెట్లో (Stock Market) శుక్రవారం కూడా ర్యాలీ కొనసాగింది. వరుస లాభాల ధోరణిలో సెన్సెక్స్ ఐదో రోజు, నిఫ్టీ ఎనిమిదో రోజు సానుకూలంగా ముగిశాయి.
ఇంట్రాడేలో 444.12 పాయింట్ల లాభంతో 81,992.85 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరికి 355.97 పాయింట్లు పెరిగి 81,904.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.50 పాయింట్ల లాభంతో 25,114 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సెక్స్ 1,193.94 పాయింట్లు, నిఫ్టీ 373 పాయింట్లు లాభపడ్డాయి. వరుసగా 8 సెషన్లలో నిఫ్టీ మొత్తం 534 పాయింట్ల పెరుగుదల సాధించింది.
Stock Market – బంగారం–వెండి ధరల ఎగసివేత:
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అప్రతిహతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,13,800 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,13,300 వద్ద నిలిచింది.
రెండు రోజుల నష్టాలకు తెరదించిన వెండి ధర బలమైన పునరుజ్జీవం సాధించింది. కిలో వెండి రూ.4,000 పెరిగి రూ.1,32,000 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
స్టాక్ మార్కెట్‌లో వరుస లాభాలతో పాటు బంగారం, వెండి ధరలు కూడా చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకోవడం పెట్టుబడిదారులకు ఆనందాన్నిస్తుండగా, వినియోగదారులకు భారంగా మారుతోంది.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు



















