తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శిలా తోరణం వద్ద నుండి దర్శన క్యూలైన్లలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామన్నారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువ చ్చినట్లు చెప్పారు.
చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్ల బడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించు కునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు ఏఈవో. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామి వారిని దర్శంచు కోవాలని కోరారు.



















