తిరుమల :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను ప్రారంభించారు ఈవో రవిచంద్ర. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి పాల్గొనే వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
టీటీడీ ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో సేవలు అందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఈవో.ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవలు అందించవచ్చని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నారు. వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు టీటీడీ ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించనున్నారు. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్య నిపుణులు ఆన్లైన్ ద్వారా టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లో తమ స్లాట్‌ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.



















