శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి

hellotelugu-TTDAEO

తిరుమల : శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ప్ర‌త్యేకంగా నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. సేవ‌క‌కుల‌లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో స్ప‌ష్టం చేశారు. తిరుమలలోని సేవా సదన్–2లో గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్లు)లకు నిర్వహించిన తొలి బ్యాచ్ ‘ట్రెయిన్ ద ట్రైనీస్‘ శిక్షణా కార్యక్ర‌మానికి ఆయన విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య చౌద‌రి మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు హిందూ ధ‌ర్మానికి ప్ర‌త్యేక ప్ర‌తినిధులు అని గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. దేశ విదేశాల నుండి తిరుమ‌ల‌కు విచ్చేస్తున్న భ‌క్తుల‌కు సేవ చేయ‌డంలో శ్రీ‌వారి సేవ‌కుల పాత్ర అత్యంత కీల‌క‌మైన‌దని చెప్పారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ద్వారా త‌మ త‌మ ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు శిక్ష‌ణ ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం–అహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్‌లను రూపొందించిన‌ట్లు తెలిపారు. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా ప్ర‌తి రోజూ తిరుమ‌ల‌కు వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డంలో కీల‌క పాత్ర వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

Exit mobile version