శ్రీ‌వారి ముడుపు ప‌థ‌కం ప్రారంభం : బీఆర్ నాయుడు

2026-27 సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ కు పాల‌క మండ‌లి ఆమోదం

hellotelugu-TTDBudget

తిరుమ‌ల : టీటీడీ పాల‌క మండ‌లి శ్రీ‌వారి ముడుపు ప‌థ‌కానికి ఆమోదం తెలిపింద‌ని ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 2026-27 సంవ‌త్స‌రానికి కూడా బ‌డ్జెట్ ను స‌ర్కార్ ఓకే చేసింద‌న్నారు. ఆలయాలు, ప్రాకారాలు, రాజ గోపురాలు త‌దిత‌ర‌ నిర్మాణాల‌కు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీ‌వాణి ట్ర‌స్టు మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదించిన‌ట్లు చెప్పారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్ర‌హం ఏర్పాటుకు గాను డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. అందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం తెల‌ప‌డం జ‌రిగింద‌న్నారు బీఆర్ నాయుడు. కోయంబత్తూర్, గువహటి, బెలగావి, అదేవిధంగా పాట్నా వ‌ద్ద మోకామ‌ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల‌కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి కేటాయించిన భూమిని తీసుకునేందుకు ఆమోదం తెలిపింద‌న్నారు.

వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే దాదాపు 70 వేల మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా రూ.50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించిన‌ట్లు చెప్పారు. గత ఏడాది తలంబ్రాల ప్యాకెట్ కిట్‌ను అందించిన విషయం తెలిసిందేన‌ని పేర్కొన్నారు..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా రూ. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు టీటీడీ చైర్మ‌న్. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది భద్రత సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుకు ఆమోదం ల‌భించింద‌న్నారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ గోశాలలు, పలమనేరులోని శ్రీవేంకటేశ్వర ఇంక్యూబేషన్ సెంటర్ లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం. టీటీడీ ఆలయాల్లో పరిచారకులుగా పని చేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

Exit mobile version