తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీవారి గరుడసేవ ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా ముగిసింది. గరుడ సేవను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల క్యూలైన్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో బందోబస్తు తదితర అంశాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులు ప్రశాంతంగా స్వామివారి గరుడసేవను తిలకించేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు.
అనంతపురం రేంజ్ ఐజీపీ డా. షిముషీ బాజ్ పై పర్యవేక్షణలో, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో, టీటీడీ సీవీ ఎస్వో కె.వి. మురళీకృష్ణతో పాటు టీటీడీ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టిగా విధులు నిర్వర్తించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట్ల సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా ఏర్పాట్లను కొనసాగించారు.
గరుడ సేవ సందర్భంగా విధులు నిర్వర్తించిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయం, క్రమశిక్షణ, అప్రమత్తతతో బాధ్యతలు నిర్వర్తించి గరుడసేవ ప్రశాంతంగా ముగిసేలా కృషి చేసినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు. రానున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కూడా ఇదే స్థాయిలో సమన్వయంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.


















