తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ధనుర్భంగం (సీతా స్వయంవరం) ఘట్టాన్ని తలపిస్తూ, శ్రీవారు శ్రీరామచంద్ర మూర్తి, అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమివ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది. స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. వైభవంగా సాగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోవింద నామ స్మరణలతో మాడ వీధులు మార్మోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరించారు.
ముత్యాలు చల్లదనం, ప్రశాంతతకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముత్యపు పందిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరించే శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించు కోవడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ దివ్య దర్శనంతో మనశ్శాంతి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జానకీ దేవి, శ్రీమతి రంగశ్రీ, నరేష్ కుమార్, జేఈవో (హెచ్ అండ్ ఈ) గోపినాథ్, సీవీఎస్వో కే.వీ. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు , తదితర అధికారులు పాల్గొన్నారు.



















