తిరుపతి జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాలన్నీ అంగరంగ వైభవోపేతంగా ముస్తాబయ్యాయి. ఓ వైపు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలను దృష్టి లో ఉంచుకుని పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా అక్కడ కూడా ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇబ్బందికర ప్రాంతాలు, నిషేధిత ప్రదేశాల్లో భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి కఠిన నియంత్రణ అమలు చేయాలని అన్నారు ఎల్. సుబ్బారాయుడు. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు , వ్యక్తుల తనిఖీలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
జిల్లా పోలీసు శాఖ, దేవస్థాన అధికారులు, ఇతర శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్పీలు శ రవి మనోహర ఆచారి (శాంతి భద్రతలు) , శ్రీనివాసులు, డీఎస్పీలు మూర్తి (శ్రీకాళహస్తి) , శ్రీనివాస్ , సిటీ సీఐ లు, ఎస్ఐలు పాల్గొన్నారు.



















