వైభ‌వోపేతం సప్తవర్ణ పుష్ప యాగం

పూల సుగంధాలతో ఆక‌ట్టుకున్న శ్రీ‌వారు

hellotelugu-PushpaYagam

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వ రస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్ప యాగం కన్నుల పండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్ప యాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ‌నివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

Exit mobile version