తిరుపతి : అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది జూన్ 25 నుండి జూలై 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందుగా 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 24న సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూన్ 25న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 26న చిన్నశేష వాహనం, హంస వాహనం, 27న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, 28న కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం, 29న మోహినీ అవతారం, గరుడ వాహనం, 30న హనుమంత వాహనం, గజ వాహనం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. ఉత్సవాలలో భాగంగా జూలై 1న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 2న రథోత్సవం, అశ్వవాహనం, 3న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా జూన్ 28వ తేదీ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేయనున్నారు.
