సరస్వతీ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

వీణాధారిగా జ్ఞాన ప్రదాతగా దివ్య దర్శనం

hellotelugu-HamsaVahanam

తిరుమల : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి, సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా వీణాధారిగా అలంకృతులైన స్వామివారి దివ్య మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. పాలను, నీటిని వేరు చేయగలదనే సంప్రదాయ భావన వివేకశక్తిని సూచిస్తుంది. ఇది ఆత్మానాత్మ వివేచనకు సంకేతం. పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘పరమ హంసలు’గా అభివర్ణిస్తాయి. భక్తుల్లో అహంభావాన్ని తొలగించి, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మపద ప్రాప్తికి అనుగ్రహించే దివ్య వాహనంగా హంస వాహనాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయం కీర్తిస్తుంది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, సీవీఎస్‌వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తిరుప‌తి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, సీఎస్పీవీఓ ముర‌ళీకృష్ణ ప‌ర్య‌వేక్ష‌ణలో భారీ ఎత్తున భద్ర‌తను ఏర్పాటు చేశారు.

Exit mobile version