హంస వాహనంపై శ్రీ కోదండ రాముడి అభయం

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

hellotelugu-HamsaVahanam

తిరుపతి : ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. తండోప తండాలుగా భ‌క్తులు త‌రలి వ‌చ్చారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్ర మూర్తి భక్తులకు అభయం ఇచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమ హంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version