తిరుపతి : తిరుపతి లోని ప్రముఖ దేవాలయం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది .పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇమచ్చారు. స్వామి వారి మంగళ విహారాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో తిలకించారు. రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం చేపట్టారు. ఇదిలా ఉండగా ఆగస్టు 9న ఆదివారం అంగరంగ వైభవంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.
సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో బి. నాగరత్న, సూపరింటెండెంట్ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
