తిరుపతి : తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు మే 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో ఆలయ పరిసరాలను దివ్య విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీహరి దశావతార మహిమను ప్రతిబింబించే ఈ ప్రత్యేక అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ మహా విష్ణువు దశావతార రూపాలను కళాత్మక విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహస్వామి, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, బలరామావతారం, హనుమాన్ రూపాలు దర్శనమిచ్చేలా రూపొందించిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రైల్వే స్టేషన్ సమీపంలో వామనావతారం, రాయలచెరువు గేట్ జంక్షన్ వద్ద బలరామావతారం, బేరీవీధిలో పరశురాముడు, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద హనుమంతుని దివ్య రూపాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతున్నాయి. అదేవిధంగా శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం, కల్కి అవతారం రూపాలు భక్తులకు భగవద్భక్తిని మరింతగా చాటుతున్నాయి. నాలుగు మాడవీధుల్లో విద్యుత్ ఆర్చ్‌లు, ఫ్లడ్‌లైట్లు, శోభాయమాన తోరణాలు, బాంబ్ స్టిక్స్, నడకదారుల వెంట ప్రత్యేక విద్యుత్ పందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఈ దివ్య విద్యుత్ అలంకరణలు తిరుపతిని వైకుంఠనగరిని తలపించేలా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా టిటిడి ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలు చేపట్టారు.
