తిరుపతి / తాళ్లపాక : తాళ్లపాకలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు ఆలయాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ధ్వజారోహణ మహోత్సవాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించి, బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి శేషవాహన సేవ భక్తులను అలరించనుంది. 26న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 27న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, 28న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనంపై స్వామి ఊరేగుతారు. 29న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ) నిర్వహించనున్నారు. 30న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం, 31న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు.
ఆగస్టు 1న రాత్రి అశ్వ వాహనం, 2న ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం, ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది. జూలై 26న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, 27న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, 28న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, 29న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నంది వాహనం, 30న సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం, 31న : సాయంత్రం పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఆగస్టు 1న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 2న వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం, ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు.



















