తిరుపతి : తిరుపతి జిల్లా నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి పూజ, అంకురార్పణం నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహన సేవలు ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న సింహ వాహనం, 23న హంస వాహనం, 24న శేష వాహనం, 25న నంది వాహనం, 26న గజ వాహనం ఉంటుంది.
ఏప్రిల్ 27న రాత్రి 07.30 గం.లకు రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగుతుంది. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్న ప్రసాదాలు అంద జేయబడతాయి.
ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామి వారి వీధి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏప్రిల్ 30న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించి, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం, భక్తిసంగీతం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాద పరచనున్నాయి.
